దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణ అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు.

జంతర్ మంతర్‌కు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతల బస్సులను అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు రోడ్డుపై నిరసనకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరలించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నాయి. ఇప్పటికే మంగళవారం కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుసగా రెండో రోజు కూడా నిరసనలు కొనసాగడంతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.