మంత్రులపై స్టింగ్ ఆపరేషన్.. 40 మందిని హెచ్చరించిన ముఖ్యమంత్రి డీకే

కర్ణాటక MLA లు, మంత్రులపై కొందరు స్టింగ్‌ ఆపరేషన్‌ చేస్తున్నట్లు సీఎం డీకే శివకుమార్‌ హెచ్చరించారు. మంగళవారం రాత్రి.. మంత్రివర్గ సమావేశంలో చర్చల సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. రానున్న విధానసభ ఎన్నికల నేపథ్యంలో భాజపా, జనతాదళ్‌ ప్రత్యేక ఏజెన్సీలను దిల్లీ నుంచి రప్పించి మంత్రివర్గంలో కీలకమైన మంత్రులపై నిఘా పెట్టాయన్నారు. ప్రస్తుతం ఐదుగురు మంత్రులపై నిఘా పెంచినట్లు సమాచారం అందిందని వివరించారు ఈ మంత్రులతో వేర్వేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేల ఆదాయ వనరులపై ఆరా తీసిన ఈడీ రానున్న రోజుల్లో మంత్రులనూ వేధించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆ ఏజెన్సీల వివరాలు బయటపెట్టబోనన్నారు. ఈ ఆరోపణలపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందించారు. మంత్రులను గుప్పిట్లో పెట్టుకునేందుకే ముఖ్యమంత్రి ‘స్టింగ్‌ ఆపరేషన్‌’ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదివరకటి సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రులపై ఇదే ఆపరేషన్‌ చేసిన డీకే శివకుమార్‌.. ఏకంగా సీఎం పదవిని చేజిక్కించుకున్నారని విమర్శించారు.