హన్మకొండ లో BRS శ్రేణులు బుధవారం మెరుపు ధర్నా నిర్వహించారు.
Brs మాజీ mla దాస్యం వినయ్ భాస్కర్ సవాలుకు స్పందనగా ఒక్కటైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
నాయిని రాజేందర్ రెడ్డి రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన
పోలిసుల లాఠీచార్జ్.. పలువురి BRS కార్యకర్తలు అరెస్ట్
వరంగల్: హనుమకొండలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన జన చైతన్య సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.. నాయిని రాజేందర్ రెడ్డి 24 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని, రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆయనను ఓడిస్తానని సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో దాస్యం వినయ్ భాస్కర్ విసిరిన సవాలును స్వీకరించి నాయిని రాజేందర్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగాయి. నిర్ణీత గడువులోగా సవాలుకు సమాధానం చెప్పాలని, వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
దాస్యం వినయ్ భాస్కర్ సవాలు, నాయిని రాజేందర్ రెడ్డి రాజీనామా డిమాండ్ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.