ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలు ఆకాశవాణి భవన్‌లో బైఠాయించారు.
దాదాపు 9 గంటల పాటు కొనసాగిన ఆందోళన తర్వాత పోలీసులు రాహుల్, ప్రియాంక సహా ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకుని బస్సుల్లో కింగ్స్‌వే క్యాంప్‌లోని న్యూ పోలీస్ లైన్స్‌కు తరలించారు. సుమారు 260 మందిని అదుపులోకి తీసుకున్నామని, వాళ్లలో 10 మంది ఎంపీలు ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అనంతరం రాహుల్, ప్రియాంక సహా నేతలను పోలీసులు విడుదల చేశారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల ఆందోళనను విమర్శించారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ రాజకీయ డ్రామా చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడాన్ని అక్రమ అరెస్టుగా అభివర్ణించారు. హైదరాబాద్‌లోనూ ఇండియా కూటమి పార్టీలు సీఈసీ రాజీనామా కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టాయి.