హైదరాబాద్‌ జీడిమెట్ల చింతల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పండగ వేళ తమ కూతురుకు బంగారం కొందామని చింతల్‌లోనిబంగారం దుకాణానికి వెళ్లిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. బంగారం పరీక్షలకు వినియోగించే సైనేడ్‌ను దుకాణంలో టేబుల్‌పై నిర్లక్ష్యంగా పోయడంతో.. అది సైనేడ్‌ అని తెలియక ఆ చిన్నారి చేతిలోకి తీసుకొని తిన్నది. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బంగారం కొందామని దుకాణానికి వెళ్తే.. బంగారంలాంటి కూతురు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. తమ కుమార్తె మృతికి షాపు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ.. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు జ్యువెల్లరీ స్టోర్‌ ఎదుట ధర్నాకు దిగారు. 

పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గోపీకృష్ణ, జానకి దంపతులు హైదరాబాద్‌ నగర పరిధిలోని చింతల్‌లో నివాసముంటున్నారు. వీరికి రెండేళ్ల పాప మిషా ఉంది. పండుగ సందర్భంగా పాపకు బంగారం కొనుగోలు చేయడానికి వారు చిన్నారి మిషాతో కలిసి చింతల్‌లోని ఓ జ్యువెల్లరీ స్టోర్‌కు వెళ్లారు. తల్లిదండ్రులు ఆభరణాలు చూస్తుండగా.. చిన్నారి స్టోర్‌లో తిరుగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో చిన్నారి మిషా.. బంగారాన్ని పరిశీలించేందుకు ఉపయోగీంచే రసాయనాన్ని తాగీంది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చిన్నారి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. గోల్డ్‌షాప్‌ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు జ్యువెల్లరీ స్టోర్‌ ఎదుట ధర్నాకు దిగారు.