*తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ* 

- *మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి*

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు. 

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన మన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పూలను పూజించే అపురూపమైన సంప్రదాయం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని, తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. చెరువులు, ప్రకృతి వనరుల పరిరక్షణ ప్రాముఖ్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ మన సంస్కృతిని భావితరాలకు అందించే గొప్ప వారసత్వమని అన్నారు.

మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, ఆటలాడుతూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఐక్యతకు, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి హృదయంలో ఆశలను నింపాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.