*ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ఛార్జీల పునఃపరిశీలన -మంత్రి పొన్నం ప్రభాకర్*

*ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఛార్జీల సమీక్షకు ప్రభుత్వం నిర్ణయం*

*ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం*

ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన కామన్ పాస్ ధరలు రోజువారీ పాస్‌కు రూ.400 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా నిర్ణయించారు.

అయితే ఈ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఛార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ధరలను నిర్ణయించే అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.