*ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ*
*సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లకుండా లక్షిత వర్గాలకే వినియోగించాలి*
*అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలి*
*ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణ*
*అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దిశా నిర్దేశం.
ఎస్సీ, ఎస్టీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి నిధులను సమర్థవంతంగా వినియోగించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇరువురు మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నిర్దేశిత లక్ష్యాలకు మాత్రమే వినియోగించేలా పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం వ్యవసాయం, ఇంధనం, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక తదితర శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
*నిధులు దారి మళ్లకుండా పకడ్బందీ చర్యలు*
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గత ప్రభుత్వాల మాదిరిగా ఇతర అవసరాలకు మళ్లించే పరిస్థితి ఇకపై ఉండకూడదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేసినట్లు సమావేశంలో అధికారులు, సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన నిధులను లక్షిత వర్గాల సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలనే స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
సబ్‌ప్లాన్ కింద కేటాయించిన ప్రతి రూపాయి ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా శాఖల వారీగా వ్యయం, లబ్ధిదారుల వివరాలు, భౌతిక పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
నిధుల వినియోగంలో జాప్యం చోటుచేసుకోకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
*ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు*
రైతు భరోసా, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు అందుతున్న ప్రయోజనాలను సమగ్రంగా నమోదు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. భూమి యాజమాన్యం ఆధారంగా అమలవుతున్న పథకాల వల్ల సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో ఏర్పడుతున్న వ్యత్యాసాలను గుర్తించి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.
అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, పథకాల వారీగా లబ్ధిదారుల పేర్లు, గ్రామాలు, సామాజిక వర్గం, అందిన ప్రయోజనాల వివరాలతో డిజిటల్ రికార్డు రూపొందించాలని సూచించారు. ప్రతి శాఖ తన పరిధిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించిన ప్రయోజనాలను స్పష్టమైన గణాంకాలతో వెల్లడించాలని అన్నారు.
*1,300 ఎకరాల ఖాళీ భూమిపై దృష్టి*
జిల్లా కలెక్టర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 1,300 ఎకరాల మేర ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు. ఈ భూమిని అవసరాలకు అనుగుణంగా వినియోగించే అవకాశాలను పరిశీలించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఇప్పటికే గుర్తించిన స్థలాలను అర్హులైన కుటుంబాలకు అందించేందుకు అవసరమైన అనుమతులు, తదుపరి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
గృహ స్థలాలు లేని అర్హులైన కుటుంబాలకు స్థలాలు సమకూర్చేందుకు అవసరమైన చోట భూసేకరణ ప్రతిపాదనలను పరిశీలించాలని తెలిపారు.
*ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు*
ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. విద్యుత్ సదుపాయాలు లేని ఆవాసాలను గుర్తించి విద్యుత్ లైన్లు, వైరింగ్, స్తంభాల ఏర్పాటు తదితర పనులను చేపట్టేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక అవసరాలను గుర్తించి కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని భట్టి విక్రమార్క సూచించారు. స్థానిక అవసరాల ఆధారంగా ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి, వివిధ శాఖల సమన్వయంతో పనులను చేపట్టాలని ఆదేశించారు.
*గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాలి*
ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మొబైల్ వైద్య యూనిట్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సేవలు అందే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, విద్యుత్, గృహ వసతి, వైద్యం, సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా లక్షిత వర్గాల జీవన ప్రమాణాలను పెంచేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, సందీప్‌కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సిక్తా పట్నాయక్, క్రిస్టినా, విజయేంద్రబోయి, గోపి, గుగులోతు రవి నాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.