ఎరోస్పేస్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం
పరిశ్రమలకు నమ్మకమైన విద్యుత్.. పారదర్శకమైన విధానాలు మా బాధ్యత
పెట్టుబడులతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
అప్రెంటిస్‌షిప్‌లు, స్థానిక పరిశ్రమలకు ఆర్డర్లతో పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయాలి
ప్రతిభకు తగిన శిక్షణ, తొలి ఉద్యోగం లభిస్తే యువత భవిష్యత్తు మారుతుంది
రక్షా ఎక్స్‌పో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెట్టుబడులకు భరోసా, పరిశ్రమలకు నిరంతర విద్యుత్, వేగవంతమైన అనుమతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానిక సంస్థలకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న పరిశ్రమలను బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పారిశ్రామిక రంగానికి నమ్మకమైన విద్యుత్ సరఫరా, పటిష్టమైన ఆర్థిక ప్రణాళికలు, పారదర్శకమైన ప్రభుత్వ విధానాలు కీలకమని పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రకటనలతోనే అభివృద్ధి పూర్తికాదని, వాటి ద్వారా ఉత్పత్తి పెరిగి, స్థానిక సంస్థలకు ఆర్డర్లు లభించి, కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అందినప్పుడే వాటి అసలైన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేశారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన ‘రక్షా ఎక్స్‌పో’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, మంత్రులు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరి, డాక్టర్ సతీష్‌రెడ్డి, కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏరోస్పేస్ రంగంలో చిన్న పరికరం లేదా విడిభాగం వందలాది మంది ప్రాణాలకు భద్రత కల్పించగలదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రయాణికులకు ఆ పరికరాన్ని తయారు చేసిన సంస్థ గురించి తెలియకపోయినా, దాని నాణ్యతపై ఉన్న నమ్మకమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని, ప్రశంసలు, చప్పట్లు లభించకపోయినా బాధ్యతతో పనిచేసే వ్యవస్థల ద్వారానే విశ్వసనీయత ఏర్పడుతుందని వివరించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ప్రభుత్వం కూడా అదే స్థాయి ఖచ్చితత్వం, క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమల్లో కొలతలు మైక్రాన్ల స్థాయిలో ఉంటాయని, ప్రభుత్వ అనుమతులు, చెల్లింపులు, విద్యుత్ కనెక్షన్ల విషయంలో అనిశ్చితి నెలకొంటే నెలల తరబడి సాగిన ఉత్పత్తి ప్రయత్నాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు వేగంగా, విశ్వసనీయంగా అందాలని ఆకాంక్షించారు.
విద్యుత్ భద్రతతోనే పరిశ్రమలకు భరోసా
ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్న తనకు పారిశ్రామిక అభివృద్ధిలో ఈ మూడు అంశాల సమన్వయం అత్యంత కీలకమని భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమల ప్రణాళికలకు నమ్మకమైన ఆర్థిక విధానాలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించే వ్యవస్థ అవసరమని చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ, విద్యుత్ గ్రిడ్ బలోపేతం, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. కేవలం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఉత్పత్తి షెడ్యూళ్లకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన సమయంలో నమ్మకమైన విద్యుత్ అందించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని వినియోగించే విషయంలోనూ ఇదే క్రమశిక్షణ అవసరమని అన్నారు. ప్రతి రాయితీ, ప్రోత్సాహకానికి ఆర్థిక వ్యయం ఉంటుందని, పరిశ్రమలకు ప్రభుత్వం అందించే సహకారం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని చెప్పారు. పెట్టుబడుల ద్వారా ఉత్పత్తి, నైపుణ్యాలు, స్థానిక సంస్థలకు వ్యాపార అవకాశాలు, కుటుంబాలకు ఉపాధి ఎంతవరకు పెరిగాయన్నదే అభివృద్ధికి అసలైన కొలమానమని వివరించారు.
ప్రతిభ ప్రతి ఒక్కరిలో ఉంటుందని, అయితే దానిని నిరూపించుకునే అవకాశాలు అందరికీ సమానంగా లభించడం లేదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే యువతిలోనూ అత్యుత్తమ ఏరోస్పేస్ టెక్నీషియన్‌గా ఎదిగే సామర్థ్యం ఉంటుందని, ఆ ప్రతిభను వెలికితీసేందుకు ఆధునిక పరికరాలపై శిక్షణ, అప్రెంటిస్‌షిప్, ప్రతిభను గుర్తించే యజమానుల ప్రోత్సాహం అవసరమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోందని తెలిపారు. ఈ ప్రయత్నాలకు పరిశ్రమలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. యువతకు లభించే తొలి శిక్షణ, మొదటి ఉద్యోగం వారి జీవిత గమనాన్ని మార్చడమే కాకుండా, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని చెప్పారు.
పారిశ్రామికవేత్తలు తమ తదుపరి పెట్టుబడి ప్రణాళికల్లో అప్రెంటిస్‌షిప్‌లకు, స్థానిక సరఫరాదారుల ప్రోత్సాహానికి ప్రత్యేక స్థానం కల్పించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. చిన్న తరహా పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని, యువతకు తొలి ఉద్యోగ అనుభవాన్ని అందించాలని సూచించారు. తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పరిశోధన, రూపకల్పన, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే సామర్థ్యాలపైనా దృష్టి పెట్టాలని అన్నారు. పారిశ్రామిక వ్యవస్థ దీర్ఘకాలికంగా బలోపేతం కావాలంటే అక్కడి ప్రజల జ్ఞానం, నైపుణ్యాలు పెరగడంతో పాటు ఆ విజ్ఞానాన్ని తరువాతి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని వివరించారు.
రక్షా ఎక్స్‌పోలో భాగస్వాములు కావాలి
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రక్షా ఎక్స్‌పోలో పారిశ్రామికవేత్తలు, నిపుణులు పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రభుత్వ విధానాలు, వ్యవస్థల్లో మెరుగుదల అవసరమైన అంశాలపై స్వేచ్ఛగా సూచనలు చేయాలని, ప్రదర్శన ముగిసిన తరువాత కూడా కొనసాగగల భాగస్వామ్యాలను అన్వేషించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తీసుకునే నిర్ణయాల ద్వారా ప్రస్తుతం ఈ సమావేశంలో లేని ఒక యువకుడికి లేదా యువతికి తొలి ఉద్యోగ అవకాశం లభించవచ్చని, అలాంటి అవకాశాలను నిజం చేసేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.రక్షా ఎక్స్‌పో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ కీలక పారిశ్రామిక ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని భట్టి విక్రమార్క అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికతకు అనుగుణంగా పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, ప్రతిభ, నైపుణ్యాలను వినియోగించుకునేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.