పెళ్లయిన 40 రోజులకే.. రోడ్డుప్రమాదంలో నవవధువు దుర్మరణం చెందిన ఘటన మలక్‌పేటలె జరిగింది. కొత్తగా పెళ్లయిన కొత్త దంపతులు శనివారం సదరాగా బైక్‌పై సాపింగ్‌కు వెళ్తుండగా ఆటో అడ్డొచ్చింది. దాంతో స్కూటీ అదుపుతప్పింది. వెనుకాల కూర్చున్న వధువు ఎగిరి ఆర్టీసీ బస్సు కింద పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన 40 రోజులకే నవ వధువు మృతి చెందడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ములుగు జిల్లాకు చెందిన శ్రీకాంత్, లావణ్యకు గత నెల ఆగస్టు 30న వివాహాం జరిగింది. శ్రీకాంత్ హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. పెళ్లయిన కొత్త దంపతులు ఎన్నో ఆశలు, ఆశయాలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎల్‌బీనగర్‌కు మకాం మార్చారు. ఇదిలా ఉండగా.. ఆ నవ దంపతులు గృహోపకరణాలు, దసరా పండుగ షాపింగ్ కోసమని శనివారం బైక్‌పై ఎల్‌బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగ్‌కు వచ్చారు. అక్కడ కొంత షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి మలక్‌పేట మీదుగా కోఠి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మలక్‌పేట డీ మార్ట్ ముందు ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడింది. దీంతో వాహనాదారులు నిదానంగా తమ వాహనాలు ఆపే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలో యూ టర్న్ తీసుకునేందుకు ప్రయత్నించిన ఆటో డ్రైవర్.. వాహనాలు ఆగకముందే నేరుగా రోడ్డుమధ్యలోకి వచ్చాడు. ఆ వెనకాల వస్తున్న శ్రీకాంత్ స్కూటీ ఆటోను తప్పించబోయిన అదుపు తప్పి కింద పడ్డాడు. అతని వెనుక కూర్చున్న భార్య పక్కనుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త శ్రీకాంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భార్య లావణ్య ఒక్కసారిగా కిందపడిపోయి విగత జీవిగా మారడంతో తట్టుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఒక దశలో షాక్‌కు గురై అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ మహ్మద్ ముజ్‌మిల్ (31)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. లావణ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎ.శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.