తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
అధికారుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు
క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా పర్యవేక్షణ
తిరుమలలో భక్తుల రద్దీ కోనసాగుతోంది. పెరటాసి మాసంతో పాటు వరుస సెలవులు నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1,2, నారాయణగిరి షెడ్లు, అక్టోపస్ సర్కిల్ వరకు బయట క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో అనునిత్యం పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. అన్న ప్రసాదం విభాగం, ఆరోగ్య విభాగం, శ్రీవారి సేవా విభాగం, విజిలెన్స్ సిబ్బంది క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లలో మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. అదేవిధంగా చెత్త పేరుకుపోకుండా నిమిషాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు. కాగా, శ్రీవారి సేవకులు భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను భక్తులకు నిరంతరాయంగా అందిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. అన్న ప్రసాద విభాగం సిబ్బంది అన్న ప్రసాదాలను ఎప్పటికప్పుడు వాహనాల్లో క్యూలైన్ల వద్దకు తరిలించడం జరుగుతోంది. టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా వైద్య విభాగం ఆధ్వర్యంలో మొబైల్ క్లీనిక్ నిరంతరాయంగా తిరుగుతూ అవసరమైన భక్తులకు వైద్య సహాయం అందించడం జరుగుతోంది. ఇదివరకే భక్తుల అధిక రద్దీని దృషిలో ఉంచుకుని ఎక్కువ మంది సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అక్టోబర్ 1వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసిన విషయం విదితమే. టీటీడీ అధికారులు, సిబ్బంది, దర్శన క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవళ్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రమిస్తున్నారు.
--------------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.