శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), 

తేది: 05.10.2026

తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ సహాయంతో రెండు కోట్ల ఇరవై లక్షలు (2,20,00,000) రూపాయలతో 623 మంది నిరుపేద రోగులకు ఉచిత అత్యున్నత వైద్యం*

*స్విమ్స్ లో ఒకే విడతలో 623 మంది పేద రోగుల ఎంపిక*

*ప్రాణాంతక, సంక్లిష్ట వ్యాధులకు పూర్తిగా ఉచిత చికిత్సకు భరోసా*

*“డబ్బుల్లేక ఏ పేదవాడికీ ప్రాణరక్షక వైద్యం దూరం కాకూడదు – నిరుపేదలకు ప్రాణభిక్ష పెట్టే మహోన్నత మానవతా సేవే శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్” – స్విమ్స్ డైరెక్టర్ & వైస్ ఛాన్సలర్ డా॥ గుడారు జగదీష్*

ఆర్థిక స్థోమత లేక అత్యున్నత వైద్య చికిత్సలకు దూరమవుతున్న పేద, నిరుపేద కుటుంబాలకు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మరోసారి గొప్ప అండగా నిలిచింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహత్తర పథకం ద్వారా 623 మంది పేద రోగులను వివిధ ప్రాణాంతక, సంక్లిష్ట వ్యాధులకు ఉచిత వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు అందించేందుకు ఎంపిక చేశారు.

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) లో 05.10.2026 వ తేది సోమవారం మధ్యాహ్నం 3.00 గం॥లకు స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన పథకం ఎంపిక కమిటీ స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ జి.జగదీష్ గారి అధ్యక్షతన జరిగింది. 

శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ డైరెక్టర్ డా॥ శ్రీనాధ్ రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్, బర్డ్ హాస్పిటల్ ఆర్.ఎం.ఓ. డా॥ రామ్మూర్తి, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా॥ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా॥ శ్రీనివాసులు, మరియు స్విమ్స్ కు చెందిన సంబంధిత విభాగాధిపతులు డాక్లర్లు, సిబ్బంది పాల్గొని 623 మంది పేద రోగులను ఉచిత శస్త్ర చికిత్సలకు ఎంపిక చేయడం జరిగింది.

 పేషంట్ల యొక్క ఆరోగ్య స్థితిగతులను, బియ్యం కార్డు కలిగి దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదలను వారి అర్హతలను బట్టి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడానికి వివిధ విభాగాల క్రింద ఎంపిక చేయడం జరిగింది.

*19 వైద్య విభాగాల్లో 623 మంది పేద రోగులకు రెండు కోట్ల ఇరవై లక్షలు (2,20,00,000) రూపాయలతో ప్రాణదాన సహాయం*

*ఎంపికైన రోగుల విభాగాల వారీ వివరాలు:*

కార్డియాలజి -36, కార్డియోథొరాసిక్ 26, ఎండోక్రైనాలజీ-02, ఇ.ఎన్.టి.-11, జనరల్ సర్జరి -64. మెడిసిన్- 26. మెడికల్ ఆంకాలజీ-26. నెప్రాలజీ-149, న్యూరాలజి -64, న్యూక్లియర్ మెడిసిన్-02. న్యూరో సర్జరీ-41, గైనకాలజి -51, పిడియాట్రిక్స్-03, సైకియార్టీ-02, రేడియాలజీ-06. రేడియేషన్ ఆంకాలజీ-16, గ్యాస్ట్రో ఎంట్రాలజీ -73, సర్జికల్ ఆంకాలజీ -24, యూరాలజీ -01, మొత్తం 623 మంది రోగులు.

గుండె, మూత్రపిండాలు, మెదడు మరియు నాడీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, జీర్ణకోశ సంబంధిత సంక్లిష్ట వ్యాధులు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద రోగులకు అవసరమైన అత్యున్నత వైద్య చికిత్సలను అందించేందుకు ఈ ఎంపిక ద్వారా మార్గం సుగమమైంది.

*పేద కుటుంబాలకు ప్రాణదాన ట్రస్ట్ – ఒక గొప్ప భరోసా*

ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ & వైస్ ఛాన్సలర్ డా॥ గుడారు జగదీష్ మాట్లాడుతూ, పేద కుటుంబంలో ఒక వ్యక్తికి తీవ్రమైన వ్యాధి వస్తే అది ఆ వ్యక్తి ఆరోగ్య సమస్యగా మాత్రమే కాకుండా, మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసే పరిస్థితిగా మారుతుందని పేర్కొన్నారు. అత్యున్నత వైద్యం, సంక్లిష్ట శస్త్రచికిత్సలకు అయ్యే వ్యయాన్ని భరించలేని నిరుపేద కుటుంబాలకు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ఒక ఆశాకిరణంగా నిలుస్తోందని తెలిపారు.

“ఆర్థిక స్థోమత లేదనే ఒక్క కారణంతో ఏ పేద రోగి కూడా ప్రాణరక్షక వైద్యానికి దూరం కాకూడదు. అత్యంత ఖరీదైన, సంక్లిష్టమైన వైద్య చికిత్స అవసరమైన నిరుపేద రోగికి అండగా నిలిచి, అతని ప్రాణాన్ని కాపాడటం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి లేదు. ఆ మహోన్నత లక్ష్యాన్ని శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కార్యరూపంలో చూపుతోంది. 623 మంది నిరుపేద రోగులకు ఒకేసారి వైద్య సహాయం అందించే ఈ నిర్ణయం 623 కుటుంబాల్లో కొత్త ఆశను నింపుతోంది” అని డా॥ గుడారు జగదీష్ పేర్కొన్నారు.

*శ్రీవారి సేవలో మానవ సేవ – ప్రాణదాన ట్రస్ట్ ప్రత్యేకత*

శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, “మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానములు వైద్య రంగంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అత్యున్నత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన చికిత్స అందించడం, వైద్య ఖర్చుల కారణంగా పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా ఆదుకోవడం వంటి లక్ష్యాలతో ఈ పథకం వేలాది కుటుంబాలకు భరోసాగా నిలుస్తోందన్నారు.

“ప్రాణదాన ట్రస్ట్ ద్వారా అందించే ప్రతి రూపాయి ఒక నిరుపేద రోగికి చికిత్సగా, ఒక కుటుంబానికి ఆశగా, ఒక ప్రాణానికి భరోసాగా మారుతుంది. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు – ప్రాణాలను నిలబెట్టే మహోన్నత సేవ” అని డా॥ గుడారు జగదీష్ అన్నారు.

పేద రోగులకు ప్రాణదాన పథకం కింద ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందించేందుకు నిరంతరం ఆర్థిక సహకారం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానముల యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

*ప్రాణదాన ట్రస్ట్ కు దాతలు చేయూతనివ్వాలి*

శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ద్వారా మరింత మంది పేద, నిరుపేద రోగులకు ప్రాణరక్షక వైద్య సేవలను విస్తరించేందుకు భక్తులు, దాతలు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సేవాభావం కలిగిన వారు విరివిగా విరాళాలు అందించి ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని డా॥ గుడారు జగదీష్ పిలుపునిచ్చారు.

“ఒక విరాళం ఒక చికిత్సకు తోడ్పడవచ్చు; ఒక చికిత్స ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు; కాపాడిన ఆ ఒక్క ప్రాణం ఒక కుటుంబ భవిష్యత్తునే నిలబెట్టవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.

“పేదవాడి ప్రాణానికి ఆర్థిక స్థోమత అడ్డుకాకూడదు – శ్రీవారి ఆశీస్సులతో ప్రతి అర్హుడైన నిరుపేద రోగికి అత్యున్నత వైద్యం అందించడమే మా సంకల్పం.”

దయచేసి పత్రికలు మరియు ప్రసార మాధ్యమాల వారు ప్రచురించి/ప్రసారం చేయవలసిందిగా ప్రార్థన.

సం/-

సంచాలకులు మరియు ఉపకులపతి

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), తిరుపతి